కర్నూలు జిల్లా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

  • వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద టెంపో, లారీ ఢీ
  • 14 మంది దుర్మరణం
  • ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
  • క్షతగాత్రులకు రూ.1 లక్ష సాయం అందించాలని నిర్ణయం
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద టెంపో, లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ టెంపో నియంత్రణ కోల్పోయి పక్కకు ఒరిగిపోగా, అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ఆ టెంపోను ఢీకొట్టింది. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గాయపడి ఆసుపత్రిపాలైన వారికి రూ.1 లక్ష చొప్పున అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. బాధితులకు అన్ని విధాల సహకారం అందించాలని ఆదేశించారు.

కాగా, ప్రమాద ఘటనపై కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ స్పందించారు. టెంపో వాహనం డ్రైవరు నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై సీఎం జగన్ తక్షణమే స్పందించి అధికారులను సంఘటన స్థలానికి పంపాలని ఆదేశించారని కలెక్టర్ వివరించారు. ప్రమాద కారణాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు సాంకేతిక బృందం సాయం తీసుకుంటున్నామని తెలిపారు.


More Telugu News