మూడు ఆసుపత్రులు తిరిగినా ఎవరూ చేర్చుకోకపోవడంతో అంబులెన్స్ లోనే ఉరేసుకున్న ఎస్ఐ

  • అస్వస్థతకు గురైన ఎస్సై రాజ్ వీర్ సింగ్
  • అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబీకుల యత్నం
  • ఒక్క ఆసుపత్రిలోనూ చేర్చుకోని వైనం
  • తీవ్ర మనస్తాపం చెందిన ఎస్సై
ఢిల్లీలో విషాదకర ఘటన జరిగింది. అనారోగ్యం పాలైన తనను ఏ ఆసుపత్రిలోనూ చేర్చుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఎస్ఐ అంబులెన్స్ లోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 39 ఏళ్ల రాజ్ వీర్ సింగ్ ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

నగరంలోని ద్వారక ప్రాంతంలో నివసించే రాజ్ వీర్ సింగ్ గత 5 రోజులుగా సెలవుపై ఉన్నారు. శుక్రవారం నాడు అస్వస్థతకు గురికావడంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే, మూడు ఆసుపత్రులకు తిరిగినా రాజ్ వీర్ సింగ్ ను చేర్చుకునేందుకు నిరాకరించారు. దాంతో ఎంతో వేదనకు గురైన ఆ ఎస్సై అంబులెన్స్ లోనే ఓ వస్త్రంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనను ఢిల్లీ పోలీస్ విభాగం తీవ్రంగా పరిగణించింది. ఎస్సై రాజ్ వీర్ సింగ్ ను ఆసుపత్రులలో ఎందుకు చేర్చుకోలేదన్న అంశాన్ని దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ మీనా తెలిపారు. తాము ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు అతడిని చేర్చుకుని ఉంటే ప్రాణాలు నిలిచేవని కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా, కరోనా భయంతోనే రాజ్ వీర్ సింగ్ ను చేర్చుకునేందుకు ఆసుపత్రులు వెనుకంజ వేసినట్టు తెలుస్తోంది.


More Telugu News