ముగిసిన తొలి రోజు ఆట... చివరి సెషన్ లో 3 వికెట్లు కోల్పోయిన భారత్

  • చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
  • తొలి రోజు ఆట చివరికి భారత్ 300/6
  • 161 పరుగులు చేసిన రోహిత్ శర్మ
  • రహానే అర్ధసెంచరీ
  • క్రీజులో పంత్, అక్షర్ పటేల్
  • రాణించిన ఇంగ్లండ్ స్పిన్నర్లు
చెన్నైలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆట చివరికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ (33 బ్యాటింగ్), అక్షర్ పటేల్ (5 బ్యాటింగ్) ఉన్నారు. ఓ దశలో 3 వికెట్లకు 248తో పటిష్ట స్థితిలో ఉన్న భారత్ ఆపై వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. చివరి సెషన్ లో 3 వికెట్లు చేజార్చుకుంది.

సెంచరీ హీరో రోహిత్ శర్మ 161 పరుగులు చేసి లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్ లో అవుట్ కాగా, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (67) మొయిన్ అలీ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. అనంతరం బౌలింగ్ కు దిగిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్... రవిచంద్రన్ అశ్విన్ వికెట్ చేజిక్కించుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లీచ్ కు 2, మొయిన్ అలీకి 2 వికెట్లు లభించగా, ఓలీ స్టోన్, రూట్ చెరో వికెట్ సాధించారు.

రేపటి ఆటలో భారత్ మరో 100 పరుగులు చేసినా ఇంగ్లండ్ పై ఒత్తిడి పెంచే వీలుంటుంది. తొలిరోజు నుంచే స్పిన్నర్లకు విశేషంగా సహకరిస్తున్న చేపాక్ పిచ్ టీమిండియా స్పిన్నర్లను ఊరిస్తోందనడంలో సందేహంలేదు.


More Telugu News