ముప్పై ఏళ్లలో మా ఇంటి నుంచి ఒక్కరూ ప్రధాని కాలేదు: రాహుల్​ గాంధీ

  • యూనివర్సిటీ ఆఫ్ షికాగో చరిత్రకారుడితో కాంగ్రెస్ నేత ముఖాముఖి
  • మంచి కోసం ప్రాణత్యాగం చేసిన నానమ్మ, నాన్నను తలచుకుంటే గర్వంగా ఉంది
  • వాళ్లను కోల్పోయినందుకు బాధపడట్లేదని కామెంట్
  • ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తనను తాను ఎంతో మార్చుకున్నానని వ్యాఖ్య
  • విమర్శలు తనకు మార్గదర్శిలా మారాయన్న రాహుల్
మంచి పనికోసం నిలబడి ప్రాణత్యాగం చేసిన నానమ్మ, నాన్నను తలచుకుంటే గర్వంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన చరిత్రకారుడు దీపేశ్ చక్రవర్తి, వర్సిటీ విద్యార్థులతో ఆన్ లైన్ ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“ఓ మంచి పనికోసం మా నాన్నమ్మ (ఇందిరా గాంధీ), నాన్న (రాహుల్ గాంధీ) నిలబడ్డారు. అందుకే వారిని హత్య చేశారు. దానికి నేను బాధపడట్లేదు. మంచి కోసం నిలబడి ప్రాణ త్యాగం చేసిన వారిని చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. వారి గురించి అర్థం చేసుకోవడంలో అది నాకు బాగా ఉపయోగపడింది. నేనేంటి? నా స్థానమేంటి? నేనేం చేస్తున్నాను? వంటి విషయాల్లో నన్ను నేను మార్చుకోవడానికి దోహదపడింది’’ అని అన్నారు.

వంశపారంపర్య రాజకీయాలపై అడిగిన ప్రశ్నకూ ఆయన బదులిచ్చారు. తన కుటుంబం నుంచి ఓ వ్యక్తి ప్రధాని అయ్యి 30 ఏళ్లు దాటిపోయిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తన కుటుంబం నుంచి ఒక్క ప్రధాని కూడా రాలేదని గుర్తు చేశారు. రాజకీయ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తనలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఓ పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం రాజకీయ ప్రవేశంపై తనను అడిగే ఉంటే సమాధానం వేరేగా ఉండేదని, ఇప్పుడు మరో రకంగా ఉంటుందని చెప్పారు.

రాజకీయ అనుభవం వచ్చే కొద్దీ ఎన్నెన్నో ఆలోచనలు మదిలో మెదులుతుంటాయని, ఒక్కో ఐడియా తనను తాను మరింత పదునుపెట్టుకునేందుకు ఉపయోగపడిందని రాహుల్ చెప్పారు. విమర్శలు తన ఆలోచనా ధోరణిని మార్చాయన్నారు. అవన్నీ తనకు మార్గదర్శకాలన్నారు. కాగా, దీపేశ్ చక్రవర్తి, ఆ యూనివర్సిటీ స్టూడెంట్లతో ఇంటరాక్షన్ జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో భూకంపం సంభవించింది. రాహుల్ ఇంట్లోని వస్తువులు కదలాడాయి. దీంతో ‘ఇక్కడ భూకంపం వచ్చిందనుకుంటా’ అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.


More Telugu News