కలలో వచ్చిందే నిజమైంది... అదే ప్రాణాలు నిలిపింది!

  • ఇంగ్లండ్ లో ఘటన
  • ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కరోలన్ బ్రూస్
  • తరచుగా చనిపోతున్నట్టు కలలు
  • నిద్రకు దూరమైన నర్సు
  • రొమ్ము క్యాన్సర్ తో చనిపోయినట్టు తాజాగా కల
ఇంగ్లండ్ కు చెందిన కరోలన్ బ్రూస్ అనే మహిళ విషయంలో కల నిజమైంది. సాధారణంగా నిద్రలో కలలు రావడం తెలిసిందే. అయితే, 51 ఏళ్ల కరోలన్ బ్రూస్ కు తరచుగా చనిపోయినట్టు కలలు వస్తుండేవి. దాంతో నిద్ర అంటే హడలిపోయే పరిస్థితి వచ్చింది. కరోలన్ బ్రూస్ ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె తాను రొమ్ము క్యాన్సర్ కు గురై, చనిపోయినట్టు కలగన్నారు. దాంతో ఆమె ఆ మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా, నిజంగానే ఆమె రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు వెల్లడైంది.

ప్రస్తుతం క్యాన్సర్ రెండో దశలో ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం కరోలన్ బ్రూస్ ఆసుపత్రిలో చేరి కోలుకుంటున్నారు. సకాలంలో ఆమె ఆసుపత్రికి రావడం వల్లే ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమెకు చావు కలలు మరెప్పుడూ రాలేదట. కలే తనను బతికించిందని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News