తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయి: మంత్రి పెద్దిరెడ్డి

  • తాడేపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశం
  • పంచాయతీ ఫలితాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వెల్లడి
  • 80 శాతానికి పైగా స్థానాలు తమవేనని వివరణ
  • జగన్ ఛరిష్మా ముందు చంద్రబాబు నిలవలేకపోతున్నారని వ్యాఖ్యలు
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు.  తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

ఇప్పటివరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను వైసీపీ సాధించిందని వెల్లడించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ఇంటి వద్దకే పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్ ఛరిష్మా ముందు చంద్రబాబు నిలవలేకపోతున్నారని, చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుందని వ్యాఖ్యానించారు.

ఇక, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపైనా మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కేంద్రానికి సంబంధించిన విషయం అని, ఇందులో సీఎం జగన్ ను ఎందుకు లాగుతున్నారంటూ ప్రశ్నించారు. అంతర్జాతీయ సంస్థ పోస్కోకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తున్నారన్న అంశంలో సీఎం జగన్ ను తీసుకురావడమేంటని అన్నారు. ఏపీ సీఎం కాబట్టి పోస్కో ప్రతినిధులు మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిశారని, ఆ మాత్రానికే చంద్రబాబు ఆరోపణలు చేయడం సరికాదని పెద్దిరెడ్డి హితవు పలికారు. పోస్కో ప్రతినిధులు సీఎంను కలిసిన సమయంలో ఉక్కు కర్మాగారం ప్రతిపాదనలేవీ లేవని స్పష్టం చేశారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

కాగా, నాడు రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం సాధించిన ప్రక్రియలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమానికి నాయకత్వం వహించారని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఇప్పుడు ఆయన స్పందించాల్సిన సమయం వచ్చిందని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాలని కోరారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఉక్కు కర్మాగారం వచ్చిందన్న విషయాన్ని ప్రధానికి వివరించాలని తెలిపారు.


More Telugu News