స్పీకర్ ఫార్మాట్లో మరోసారి రాజీనామా లేఖను ఇచ్చాను: గంటా శ్రీనివాసరావు

  • ఈ నెల 6న విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేశా
  • అయితే, అది ఫార్మాట్ లో లేదన్నారు
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మికుల దీక్షకు మ‌ద్ద‌తు
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవ‌ల‌ తన పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖను పంపగా, అది స్పీక‌ర్ ఫార్మాట్‌లో లేద‌ని విమ‌ర్శ‌లు వచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న ఈ రోజు స్పీక‌ర్ ఫార్మాట్లో త‌న రాజీనామా లేఖ‌ను పంపారు. 'ఈ నెల 6న విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేశా. అయితే, అది ఫార్మాట్ లో లేదన్నారు. ఇప్పుడే మరోసారి అన్ని ఫార్మాట్ లలో రాజీనామా లేఖ ఇచ్చాను' అని గంటా శ్రీనివాస రావు చెప్పారు.
     
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఈ రోజు కార్మికులు దీక్ష చేస్తోన్న విష‌యం తెలిసిందే. అక్క‌డ‌కు వెళ్లిన గంటా శ్రీనివాస‌రావు కార్మికుల‌కు మ‌ద్ద‌తు తెలిపారు.  'విశాఖపట్నం కూర్మన్నపాలెం గేట్ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశాను. కార్మిక సంఘాలకు అండగా నిలుస్తాను. స్టీల్ ప్లాంట్ అంశంపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలి' అని ఆయ‌న డిమాండ్ చేశారు.
 
'ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి నిర్ణయం వెనక్కి తీసుకునేలా పోరాడాలి. రోజుకో కార్యక్రమంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడు ఉక్కు కర్మాగారం' అని గంటా శ్రీనివాస‌రావు చెప్పారు.


More Telugu News