ఎంపీలందరితో కలిసి సీఎం జగన్ ప్రధానిని కలవాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • ఎందరో ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటయింది
  • ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
  • ఈ అంశంపై జగన్ కూడా దృష్టి సారించాలి
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం  చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటయిందని... అలాంటి ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడం సరికాదని అన్నారు.

విశాఖ ప్లాంట్ నుంచి ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో స్థానిక ప్రజలు సెంటిమెంటల్ గా కనెక్ట్ అయ్యారని... ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. వైసీపీ ఎంపీలందరితో కలిసి ప్రధాని మోదీని జగన్ కలవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ అంశంపై పోరాడితే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.


More Telugu News