స్మార్ట్ ఫోన్ వాడకంలో భారతీయులే టాప్!

  • రోజుకు దాదాపు ఐదు గంటల పాటు వినియోగం
  • ఐదేళ్లలో 17 రెట్లు పెరిగిన వాడకం
  • 5జీ వస్తే సెకనుకు 1 జీబీ స్పీడ్ అందుబాటులోకి
  • రిపోర్టును విడుదల చేసిన నోకియా
స్మార్ట్ ఫోన్... నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. పొద్దున్నే లేచినప్పటి నుంచి వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ల నుంచి మెసేజ్ లు, మెయిల్స్ చూసుకుంటూ, ఎన్ని లైక్స్, ఎన్ని షేర్లు వచ్చాయో చూసుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్ ను అత్యధికంగా వినియోగిస్తున్నది ఎవరో కాదు... మనమే. రోజుకు ఒక్కో యూజర్ 4.48 గంటల చొప్పున స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు. నోకియా, ఎంబీటీఐ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. గత సంవత్సరం స్మార్ట్ ఫోన్ వాడకం ఏకంగా నాలుగు రెట్లు పెరిగిందని, లాక్ డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగానే ఇది సంభవమైందని కూడా పేర్కొంది.

2015లో నెలకు సగటు వినియోగం కేవలం 0.8 జీబీ ఉండగా, ఐదేళ్ల వ్యవధిలోనే అది 17 రెట్లు పెరిగి 2020 నాటికి 13.5 గిగాబైట్లకు చేరుకుందని ఈ రిపోర్టు వెల్లడించింది. ఇండియా 5 జీ సేవలను అందుకునేందుకు పూర్తి సన్నద్ధంగా ఉందని చెప్పడానికి ఈ గణాంకాలే పునాదులని అభిప్రాయపడింది. 5జీ తరంగాలు అందుబాటులోకి వస్తే, ఇంటర్నెట్ గరిష్ఠ వేగం సెకనుకు ఒక గిగాబైట్ కు పెరుగుతుందని తెలిపింది.

ఇక భారతీయులు వినియోగిస్తున్న డేటాలో అత్యధిక భాగం సోషల్ మీడియా నిమిత్తం ఖర్చవుతోందని వెల్లడించింది. 54 శాతం మంది సామాజిక మాధ్యమాలు, ఓటీటీలో వచ్చే వీడియోలు, యూ ట్యూబ్ కు డేటాను అధికంగా వినియోగిస్తుండగా, 46 శాతం ఫిన్ టెక్, ఎడ్యుకేషన్, ఈ-టెయిలింగ్ం ఫిట్ నెస్ కోసం వెచ్చిస్తున్నారని పేర్కొంది.

ఇదే సమయంలో మొబైల్ ఇంటర్నెట్ వాడకంలో ఫిన్ లాండ్ తరువాతి స్థానంలో భారత్ ఉందని నోకియా సీఎంఓ అమిత్ మార్వా వెల్లడించారు. ఐదేళ్ల క్రితం ఇండియాలో 164 పెటాబైట్స్ (ఒక పెటాబైట్ 10 లక్షల జీబీలు) డేటా వినియోగంలో ఉండగా, గత సంవత్సరం డిసెంబర్ కు ఇది 10 వేల పెటాబైట్స్ కు చేరుకుందని తెలిపింది. బ్రాడ్ బ్యాండ్ల విషయానికి వస్తే, 2019లో 15 శాతంగా ఉన్న కనెక్షన్ల సంఖ్య 2025 నాటికి 48 శాతానికి పెరుగుతాయని ఈ రిపోర్టు వెల్లడించింది.

ఇండియాలో 18 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యాక్టివ్ యూజర్లు షార్ట్ వీడియోలను తిలకిస్తున్నారని, ఒక్కో నెలలో 100 బిలియన్ నిమిషాల పాటు షార్ట్ వీడియోలను చూస్తున్నారని, ఈ సమయం వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు రెట్లు పెరుగుతుందని నోకియా, ఎంబీఐటీ అంచనా వేసింది. దేశంలో 4జీ వినియోగదారుల సంఖ్య 70.2 కోట్లకు చేరగా, డేటా ట్రాఫిక్ గత నాలుగేళ్లలో 60 రెట్లు పెరిగిందని, ప్రపంచంలోనే ఇదే అత్యధికమని వెల్లడించింది.


More Telugu News