అత్యంత భయంకర పరిస్థితుల మధ్య బతుకుతున్నాం: జస్టిస్​ రంజన్​ గొగోయ్​

  • ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈస్ట్ 2021లో వ్యాఖ్యలు
  • అధికారం, పెద్ద గొంతున్నవారి నుంచే ముప్పు  
  • సీఏఏ, ఎన్ఆర్సీని జాగ్రత్తగా అమలు చేయాలని సూచన
  • శాంతియుత నిరసనలు ప్రతి ఒక్కరి హక్కు అన్న మాజీ చీఫ్ జస్టిస్
  • సాగు చట్టాలపై న్యాయ లేదా రాజకీయ పరిష్కారమే మార్గమని కామెంట్ 
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు జస్టిస్ రంజన్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య బతుకుతున్నారని అన్నారు. ప్రతి మూల నుంచీ దేశానికి ముప్పు ఎదురవుతోందని చెప్పారు. శుక్రవారం ఇండియా టుడే నిర్వహించిన ‘కాన్ క్లేవ్ ఈస్ట్ 2021’లో ఆయన పాల్గొన్నారు. విలేకరులు, స్వచ్ఛంద కార్యకర్తలను దేశద్రోహం కింద అరెస్ట్ చేస్తున్నారన్న వ్యాఖ్యాత ప్రశ్నకు.. ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

‘‘మనం భయంకర పరిస్థితుల్లో బతకట్లేదని మీరు అనుకుంటున్నారా? కచ్చితంగా మనం ఇప్పుడు అలాంటి పరిస్థితుల మధ్యే బతుకుతున్నాం. అధికారం, పెద్ద గొంతు ఉన్న వారి నుంచే ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో న్యాయ వ్యవస్థ సమర్థతను పున:సమీక్షించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు. దేశాన్ని న్యాయవ్యవస్థ నడపదని, ప్రభుత్వం నడుపుతుందని అన్నారు. న్యాయవ్యవస్థ పరిధి పరిమితమన్నారు.

సీఏఏని జాగ్రత్తగా అమలు చేయాలి

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ)లను జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉందని గొగోయ్ అన్నారు. పార్లమెంట్ తన పరిధి మేరకు సీఏఏని పాస్ చేసిందన్నారు. అయితే, తన సొంత రాష్ట్రం అసోం ప్రజలు సహా చాలా మంది దానిపై ఆందోళనలు చేశారన్నారు. అసోం ప్రజలు సహా కొన్ని వర్గాల ఉనికికి అది ప్రమాదకరమన్న భావన చాలా మందిలో నాటుకుపోయిందని చెప్పారు. దీని వల్ల ఈశాన్య భారతానికి చికెన్ నెక్ అని పిలుచుకునే అత్యంత సన్నని సరిహద్దులకు చాలా ప్రమాదకరమని అన్నారు.

రైతుల పోరాటంపైనా జస్టిస్ గొగోయ్ స్పందించారు. శాంతియుతంగా నిరసనలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం సాగు చట్టాలు కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దీనికి న్యాయ వ్యవస్థ తరఫున గానీ, రాజకీయంగా గానీ పరిష్కారం తప్పనిసరిగా జరగాల్సిందేనని చెప్పారు.


More Telugu News