ఢిల్లీ సరిహద్దులకు టన్నుల కొద్దీ నిత్యావసరాలు... సుదీర్ఘకాలం నిరసనలకు రైతుల రెడీ!

  • మౌలిక వసతులు కల్పించుకున్న రైతు సంఘాలు
  • 100కు పైగా సీసీటీవీలు, ఓ కంట్రోల్ రూమ్ కూడా
  • 600 మంది వాలంటీర్ల నియామకం
  • భారీ ఎల్సీడీ స్క్రీన్ల ఏర్పాటు
  • ట్రాఫిక్ కు అవాంతరాలు వుండవన్న రైతు సంఘం నేత 
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని గత మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించి నిరసనలు తెలియజేస్తున్న రైతులు, సుదీర్ఘకాలం పాటు దీన్ని కొనసాగించేందుకు సిద్ధమై, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. దీంతో వారి నిరసనలు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా సింఘూ సరిహద్దుల్లో ఉన్న రైతులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను, సౌకర్యాలనూ రైతు సంఘాలు పెంచుకున్నాయి.

సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో రైతు నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు, మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తమ పంటలకు కనీస మద్దతు ధరపై చట్ట బద్ధత కల్పించాల్సిందేనని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తుండగా, చట్టాల రద్దు దిశగా నిర్ణయం తీసుకోలేమని అంటున్న కేంద్రం, ఎంఎస్పీకి చట్టబద్ధత అంశంపైనా రైతులకు హామీ ఇవ్వలేదు.

ఇక సరిహద్దుల్లోకి టన్నుల కొద్దీ నిత్యావసరాలు, గ్యాస్, మొబైల్ టాయిలెట్లు తదితరాలను రైతులు సమకూర్చుకున్నారు. "మేము మరింత బలపడ్డాం. మా సమాచార వ్యవస్థ కూడా బలంగా ఉంది. సుదీర్ఘకాలం పాటు ధర్నాను కొనసాగించేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నాం" అని సింఘూ సరిహద్దుల వద్ద రైతు నిరసనలకు సంబంధించిన అవసరాల నిర్వహణను పర్యవేక్షిస్తున్న దీప్ ఖాత్రి వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో రైతులను ఎప్పటికప్పుడు గమనించేందుకు 100కు పైగా సీసీటీవీ కెమెరాలను, డిజిటల్ వీడియో రికార్డర్లను అమర్చారు. వీటిని అనుసంధానిస్తూ, తాము ఓ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నామని ఖాత్రి వెల్లడించడం గమనార్హం. రైతులు ఉన్న ప్రాంతాన్ని అనుక్షణం కాపాడేందుకు 600 మందితో కూడిన వాలంటీర్ల పెట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేశామని, వీరందరూ ఆకుపచ్చని జాకెట్లు, ఐడీ కార్డులతో తిరుగుతూ, సులువుగా గుర్తించేలా ఉంటారని అన్నారు.

10 ప్రాంతాల్లో భారీ ఎల్సీడీ స్క్రీన్లను అమర్చామని, ఇవి ఒక్కోటి 700 నుంచి 800 మీటర్ల దూరంలో ఉంటాయని, రైతులంతా తమ నేతల ప్రసంగాలను వీటి ద్వారా వినవచ్చని ఆయన అన్నారు. సాధరణ ట్రాఫిక్ కు అవాంతరాలు కలుగకుండా ఏర్పాట్లు చేశామని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, వాలంటీర్లు దాన్ని సరిదిద్దుతారని తెలిపారు.


More Telugu News