ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి వైసీపీ.. సొంతంగా అభ్యర్థులను నిలిపే యోచన!

  • శాసనమండలిపై పట్టు సాధించే యోచన
  • నేరుగా అభ్యర్థులను దింపాలని అధిష్ఠానం నిర్ణయం
  • అభ్యర్థుల కోసం వేట మొదలు
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఫలితంగా మండలిలో తమ బలం పెంచుకోవాలని యోచిస్తోంది. ఇతర ఉపాధ్యాయ సంఘాల తరపున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం కంటే సొంతంగానే అభ్యర్థులను బరిలోకి దింపడం మంచిదని పార్టీ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టింది.

గుంటూరు-కృష్ణా జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యాశాఖ జేడీ ప్రతాప్‌రెడ్డి భార్య కల్పలతారెడ్డి పోటీకి దిగుతున్నారు. ఆమె ఎలాగూ వైసీపీ మద్దతు కోరడంతో నేరుగా ఆమెనే తమ అభ్యర్థిగా ప్రకటించాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, తెనాలికి చెందిన విద్యా సంస్థల అధినేత రామారావు రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావుకు బంధువు. ఆయన కూడా పోటీకి సన్నద్ధం అవుతుండడం, వైసీపీ మద్దతు కోరడంతో దీనిని అధికారపార్టీ అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ విషయంలో ముగ్గురి పేర్లను వైసీపీ పరిశీలిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


More Telugu News