కొవాగ్జిన్ ను తక్షణం నిలిపివేయాలని కోరిన చత్తీస్ గఢ్... దీటుగా బదులిచ్చిన కేంద్రం!

  • టీకాపై అనుమానాలు ఉన్నాయన్న రాష్ట్ర మంత్రి
  • వ్యాక్సిన్ లక్ష్యాన్ని అందుకోవడంలో చత్తీస్ గఢ్ విఫలం
  • ముందు ఆ సంగతి చూడాలన్న కేంద్ర ఆరోగ్య మంత్రి
భారత్ బయోటెక్ తయారు చేయగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలకు ఇస్తున్న కొవాగ్జిన్ టీకాపై తమకు అనుమానాలు ఉన్నాయని, దాని సరఫరాను తమ రాష్ట్రానికి నిలిపివేయాలని చత్తీస్ గఢ్ ప్రభుత్వం కోరింది. మూడవ దశ ట్రయల్స్ ఇంకా పూర్తికాని వ్యాక్సిన్ తుది ఫలితం ఎలా ఉంటుందో తెలియదని, పైగా తమకు అందుతున్న వ్యాక్సిన్ వయల్స్ పై ఎక్స్ పైరీ తేదీ లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దియో, దీనిపై ప్రజల్లో కూడా అసంతృప్తి ఉందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ స్పందిస్తూ, "మీ రాష్ట్రం వ్యాక్సిన్ లక్ష్యాన్ని అందుకోవడంలోను, షెడ్యూల్ ప్రకారం ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాను ఇవ్వడంలోను చాలా వెనుకబడివుంది. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ముందు ఆ సంగతి చూడండి" అని సమాధానం ఇవ్వడం గమనార్హం.

కాగా, కోవాగ్జిన్ మూడవ దశ ట్రయల్స్ ఫలితాలు ఇంకా వెలువడలేదన్న సంగతి తెలిసిందే. అయినా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీన్ని ప్రస్తుతానికి క్లినికల్ ట్రయిల్స్ మోడ్ లోనే వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ సురక్షితమని, శరీరంలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచేవేనని ఈ సందర్భంగా హర్ష వర్ధన్ స్పష్టం చేశారు. ఇక వ్యాక్సిన్ ఎక్స్ పైరీ తేదీపై వెల్లడించిన అనుమానం కూడా అవాస్తవమని, దానిపై తేదీ ఉందని చెబుతూ, ఓ టీకా చిత్రాన్ని ఆయన పోస్ట్ చేశారు.

తొలి దశలో 69.8 శాతం మంది చత్తీస్ గఢ్ హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించగా, కేవలం 9.55 శాతం మందికి మాత్రమే తొలి డోస్ ఇచ్చారని, ఇది అత్యంత అసంతృప్తికరమని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. తక్షణం మరింత మందికి వ్యాక్సిన్ ను ఇస్తే, కేంద్రం సంతోషిస్తుందని చెబుతూ, హర్షవర్ధన్ నుంచి చత్తీస్ గఢ్ ఆరోగ్య మంత్రికి ఓ లేఖ అందింది.


More Telugu News