ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 180 మీటర్ల దూరంలో బాధితులు

  • సొరంగంలో ఇంకా 30 మంది ఉంటారని అనుమానం
  • గట్టిపడిన బురదగుండా డ్రిల్లింగ్ చేపట్టిన సహాయక సిబ్బంది
  • ఇప్పటి వరకు 32 మంది మృతదేహాల వెలికితీత
ఉత్తరాఖండ్ జలప్రళయం కారణంగా తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలను ఉపయోగించిన ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది నాలుగో రోజైన నిన్న వ్యూహం మార్చారు. బురద గట్టిపడుతుండడంతో దానిగుండా డ్రిల్లింగ్ చేస్తూ లోపల చిక్కుకుపోయిన వారికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

సొరంగంలో ఇప్పటికే 120 మీటర్ల మేర బురదను తొలగించారు. మరో 180 మీటర్లు కనుక ఆ పని చేయగలిగితే లోపల చిక్కుకున్న బాధితులను రక్షించే వీలుంది. అయితే, బురద గట్టిగా మారడంతో తొలగించడం కష్టంగా మారుతోంది. దీంతో డ్రిల్లింగ్ పనులు చేపట్టారు.

మరోవైపు, నాలుగు రోజులుగా ప్రశాంతంగా ఉన్న ధౌలిగంగా నది నిన్న మళ్లీ ఒక్కసారిగా పోటెత్తడంతో సహాయక చర్యలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. కాగా, సొరంగంలో 30 మంది వరకు చిక్కుకుని పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే, ఇప్పటి వరకు 32 మంది మృతదేహాలను వెలికి తీశారు.


More Telugu News