నూజివీడు ట్రిపుల్ ఐటీలో విజయనగరం జిల్లా విద్యార్థి ఆత్మహత్య
- పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి
- హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య
- కారణాలపై ఆరా తీస్తున్నామన్న పోలీసులు
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన టి. పరమేశ్వర జగన్నాథం (18) నిన్న మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.