యముడి వేషంలో వచ్చి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పోలీసు

  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోనూ వ్యాక్సిన్ ప్రక్రియ
  • యమధర్మరాజు వేషం వేసిన కానిస్టేబుల్ జవహర్ సింగ్
  • అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించడం కోసమేనని వెల్లడి
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మొదటి విడతలో కరోనా యోధులైన వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసులకు టీకా వేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ కు చెందిన జవహర్ సింగ్ అనే పోలీస్ కానిస్టేబుల్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసుపత్రికి రాగా, అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. జవహర్ సింగ్ తన ఖాకీ యూనిఫాం తీసేసి, యమధర్మరాజు వేషధారణతో రావడమే అందుకు కారణం. యముడిని తలపించేలా మేకప్, తలపై కిరీటం, చేతిలో గద ధరించిన ఈ ఇండోర్ నగర పోలీసు కళ్లకు కూలింగ్ గ్లాసెస్ తో విచ్చేశాడు.

దీనిపై జవహర్ సింగ్ మాట్లాడుతూ, కరోనా పోరాట యోధులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించేందుకు యముడి వేషం వేశానని తెలిపాడు. గత ఏడాది ఏప్రిల్ లోనూ కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సింగ్ యముడి వేషం వేసి ఇండోర్ నగర వీధుల్లోకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోలీసు కానిస్టేబుల్ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.


More Telugu News