తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు అమెరికా పౌరసత్వం వదులుకుని వచ్చేసిన జీహెచ్ఎంసీ నూతన మేయర్!

  • గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గా గద్వాల విజయలక్ష్మి
  • విజయలక్ష్మి టీఆర్ఎస్ నేత కేకే కుమార్తె
  •  18 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న విజయలక్ష్మి
  • 2007లో హైదరాబాద్ తిరిగి రాక
  • 2016లో బంజారాహిల్స్ కార్పొరేటర్ గా విజయం
జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా ఎన్నికైన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి కె.కేశవరావు టీఆర్ఎస్ పార్టీ నేత. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు కుమార్తె విజయలక్ష్మి కూడా రాజకీయాల్లోకి వచ్చారు.

విజయలక్ష్మి విద్యాభ్యాసం హైదరాబాదులోనే సాగింది. హోలీ మేరీ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె ఆపై రెడ్డి ఉమెన్స్ కాలేజీలో చదివారు. విజయలక్ష్మి జర్నలిజం కోర్సు చేయడమే కాదు, ఎల్ఎల్ బీ కూడా చదివారు. విజయలక్ష్మి వివాహం బాబీ రెడ్డితో జరిగింది. 18 ఏళ్ల పాటు భర్తతో అమెరికాలో ఉన్నారు. ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. అయితే ఆ పౌరసత్వాన్ని వదలుకుని 2007లో భారత్ వచ్చారు. అమెరికాలో ఉన్న సమయంలో ఆమె నార్త్ కరోలినా యూనివర్సిటీలో రీసెర్చ్ అసిస్టెంట్ గా వ్యవహరించారు.

 తన భవిష్యత్తు రాజకీయాల్లోనే అని భావించి హైదరాబాద్ తిరిగొచ్చారు. 2016లో బంజారాహిల్స్ కార్పొరేటర్ గా తన రాజకీయ ప్రస్థానం ఆరంభించిన గద్వాల విజయలక్ష్మి ఈసారి ఏకంగా మేయర్ పదవిని అధిష్ఠించారు.


More Telugu News