ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా

  • మార్చి 14న పోలింగ్.. 17న ఫలితాలు
  • ఈ నెల 16న ఎన్నికలకు నోటిఫికేషన్
  • షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29తో గడువు పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆ స్థానాలకు మార్చి 14వ తేదీన ఎన్నికలు పెడుతున్నట్టు ప్రకటించింది. 17వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. మార్చి 22 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదీ షెడ్యూల్..

  • ఎన్నికల నోటిఫికేషన్– ఫిబ్రవరి 16 (మంగళవారం)
  • నామినేషన్లకు గడువు– ఫిబ్రవరి 23 (మంగళవారం)
  • నామినేషన్ల పరిశీలన– ఫిబ్రవరి 24 (బుధవారం)
  • నామినేషన్ల ఉపసంహరణకు గడువు– ఫిబ్రవరి 26 (శుక్రవారం)
  • పోలింగ్ తేదీ, సమయం – మార్చి 14 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (ఆదివారం)
  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు– మార్చి 17 (బుధవారం)

కాగా, తెలంగాణలో మహబూబ్ నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం బీజేపీ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వరంగల్– ఖమ్మం– నల్గొండకు టీఆర్ ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏపీలో తూర్పు–పశ్చిమ గోదావరి నియోజకవర్గం నుంచి రాము సూర్యారావు, కృష్ణా–గుంటూరు నియోజకవర్గం నుంచి ఎ.ఎస్. రామకృష్ణలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు.


More Telugu News