తాము అధికారంలోకి వస్తే సాగు చట్టాలను రద్దు చేస్తామన్న ప్రియాంక.. కొత్త నాటకం ప్రారంభించారన్న యూపీ మంత్రి

  • సాగు చట్టాలు రాక్షసమైనవి
  • రైతులను మోదీ, బీజేపీ నేతలు అవమానిస్తున్నారు
  • తమ లక్ష్యం అధికార మార్పు కాదన్న రాకేశ్ తికాయత్
తాము అధికారంలోకి వస్తే కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఉత్తరప్రదేశ్‌లోని 27 జిల్లాల్లో పది రోజులపాటు ‘జై జవాన్, జైకిసాన్’ పేరుతో ‘కిసాన్ పంచాయతీ’ ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిన్న షహరాన్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు రాక్షసమైనవని, తాము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామని అన్నారు. కొత్త చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులను ప్రధాని మోదీ, బీజేపీ నేతలు అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రియాంక హామీపై యూపీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా స్పందించారు. రైతుల పేరిట కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. మరోవైపు, రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ కూడా స్పందించారు. తాము సమస్యల పరిష్కారం కోసమే పోరాడుతున్నామని, అధికార మార్పు కోసం కాదని అన్నారు.


More Telugu News