ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది: ఐసీఎంఆర్​ అనుబంధ సంస్థ ఎన్​ఐఎన్​

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది: ఐసీఎంఆర్​ అనుబంధ సంస్థ ఎన్​ఐఎన్​
  • జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో మూడో రౌండ్ సీరో సర్వే
  • 24.1 శాతం మందిలో కరోనా ప్రతిరక్షకాలున్నట్టు వెల్లడి
  • గత అధ్యయనంతో పోలిస్తే 3.1 రెట్లు పెరిగాయన్న సంస్థ
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. తెలంగాణలో ఇవ్వాళ్టికి మొత్తం కరోనా కేసులు దాదాపు 2.96 లక్షలు. అంటే రాష్ట్ర జనాభాలో కేసుల శాతం 0.74 శాతమే. కానీ, అనధికారికంగా 24 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని చెబుతోంది భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం. అవును, హైదరాబాద్ లోని ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ జాతీయ పోషకాహార సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్– ఎన్ఐఎన్) సీరో సర్వే చేసింది. జాతీయ సీరో సర్వేలో భాగంగా మూడో రౌండ్ సర్వేని పూర్తి చేసింది.

జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ లో ఆ సర్వే చేసింది. అక్కడి ప్రజల రక్త నమూనాలను సేకరించి.. కరోనా యాంటీబాడీ టెస్టులు చేసింది. అందులో 24.1 శాతం మందికి అప్పటికే కరోనా వచ్చిపోయిందని నిర్ధారించింది. అంటే ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా ప్రతిరక్షకాలున్నట్టు తేల్చింది. అయితే, చాలా మందికి కరోనా వచ్చిపోయిన సంగతి తెలిసి ఉండదని వ్యాఖ్యానించింది.

గత ఏడాది ఆగస్టులో చేసిన సీరో సర్వేతో పోలిస్తే.. డిసెంబర్ లో చేసిన సర్వేలో కరోనా ప్రతి రక్షకాలున్న వారి సంఖ్య 3.1 రెట్లు పెరిగిందని ఎన్ఐఎన్ డైరెక్టర్ ఆర్. హేమలత చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకున్న పటిష్ఠమైన చర్యల వల్లే కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.

కరోనా నిబంధనలను ప్రజలు పాటించడం వల్లే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఐసీఎంఆర్ నోడల్ అధికారి ఎ. లక్ష్మయ్య చెప్పారు. జనం మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

కాగా, గత ఏడాది మేలో జనగామలో చేసిన మొదటి సీరో సర్వేలో.. కేవలం 0.49 శాతం మందిలోనే కరోనా ప్రతిరక్షకాలున్నట్టు ఎన్ఐఎన్ తెలిపింది. ఆగస్టులో అది 18.2 శాతానికి పెరగ్గా.. డిసెంబర్ కు వచ్చే సరికి 24.85 శాతానికి వచ్చింది. నల్గొండలో వరుసగా 0.24% (మే), 11.1% (ఆగస్టు), 22.9% (డిసెంబర్), కామారెడ్డిలో 0.24% (మే), 6.9% (ఆగస్టు), 24.7% (డిసెంబర్) మేర ప్రతిరక్షకాలున్నట్టు తేల్చింది.


More Telugu News