ఎర్రకోట విధ్వంసంలో మరో మోస్ట్ వాంటెడ్ ఇక్బాల్ అరెస్ట్... దీప్ సిద్ధూకు వారం రోజుల కస్టడీ!

  • జనవరి 26న ఎర్రకోటపై దాడి
  • ఇక్బాల్ ఆచూకీపై ఇప్పటికే రూ. 50 వేల రివార్డు
  • హోషియాన్ పూర్ లో అరెస్ట్
  • నిందితులను కలిపి విచారించే అవకాశం
జనవరి 26న న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఇక్బాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి పంజాబ్ లోని హోషియాన్ పూర్ లో స్పెషల్ సెల్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ఇక్బాల్ ఆచూకీ తెలిపితే రూ. 50 వేల రివార్డును కూడా పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 45 ఏళ్ల ఇక్బాల్ సింగ్, ఎర్రకోటపై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడు, పంజాబ్ నటుడు దీప్ సిద్ధూతో పాటు కీలక ముద్దాయిగా ఉన్నారు.

ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న దీప్ సిద్ధూను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆపై ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా, 7 రోజుల కస్టడీని విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆయన్ను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఢిల్లీ పోలీసులు, పలు కీలక వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. దీప్ సిద్ధూ గత వీడియోలు, ప్రసంగాలు, ఆయన రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న వీడియోలను చూపిస్తూ, వివరాలను అడుగుతున్నట్టు సమాచారం.

ఇదే కేసులో రూ. 50 వేల రివార్డును పోలీసులు ప్రకటించిన మరో నిందితుడు సుఖ్ దేవ్ సింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చండీగఢ్ నుంచి ఆయన పారిపోతున్నాడన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు, దాదాపు 100 కిలోమీటర్ల దూరం చేజ్ చేసి సుఖ్ దేవ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రకోటపై దాడి కేసులో ఇంతవరకూ 38 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా, అరెస్ట్ చేసిన నిందితులందరినీ ఒకే చోటకు చేర్చి విచారించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.


More Telugu News