అమరావతి భూములపై సుప్రీంలో విచారణ... కౌంటర్ దాఖలు చేయలేదంటూ టీడీపీ నేతలపై కోర్టు ఆగ్రహం

  • అమరావతి భూములపై సిట్, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుపై హైకోర్టు స్టే
  • హైకోర్టు నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర సర్కారు
  • విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం
  • వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రలపై అసంతృప్తి
  • కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు
అమరావతి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా టీడీపీ నేతలకు అనూహ్య పరిణామం ఎదురైంది. ఈ కేసుకు సంబంధించిన నోటీసుల పట్ల కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమరావతి భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు, అమరావతి భూములపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అంశాలపై హైకోర్టు స్టే ఇవ్వగా, హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఇదే చివరి అవకాశం అని పేర్కొంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు టీడీపీ నేతలు గడువు కోరగా, రెండు వారాల సమయం ఇస్తున్నామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లేని పక్షంలో తాము ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందని తెలిపింది.

అటు, తర్వాతి వారంలో రిజాయిండర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ మార్చి 5కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. అదే రోజున పూర్తిస్థాయిలో వాదనలు వింటామని, దమ్మాలపాటి శ్రీనివాస్ కేసును కూడా అప్పుడే విచారిస్తామని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డిల ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.


More Telugu News