రోడ్లపైకి వచ్చి సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్ ప్రజల ఆందోళన.. కర్ఫ్యూ విధించిన సైన్యం

  • గత వారం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం
  • పాలనను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలంటూ ప్రజల ఆందోళన
  • రోడ్లపై ఐదుగురికి మించి కనిపించకూడదంటూ నిషేధాజ్ఞలు
మయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వాన్ని గద్దె దించిన సైన్యంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన మిలటరీ సామాజిక మాధ్యమాలను నిషేధించడంతోపాటు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయినప్పటికీ తగ్గని ప్రజలు వీధుల్లోకి వచ్చి సైన్యానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తూ సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అధికారాన్ని తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో  ప్రజలను అణచివేసేందుకు మయన్మార్‌లోని అతిపెద్ద నగరాలైన యాంగాన్, మాండలేలలో రాత్రిపూట సైన్యం కర్ఫ్యూ విధించింది. ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకే చోట కనిపించకూడదంటూ నిషేధాజ్ఞలు విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.


More Telugu News