ఉప్పల్ భగాయత్ నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమవుతుంది: బండి సంజయ్

  • ఉప్పల్ భగాయత్ లో కుల సంఘాల భూములు పరిశీలించిన సంజయ్
  • బీసీలను మోసం చేసే ప్రయత్నంలో ఉన్నాడంటూ కేసీఆర్ పై విమర్శలు
  • బీసీలను బానిసలుగా చూస్తున్నాడని వెల్లడి
  • సీఎంగా ఎవరున్నా చేసేదేమీ లేదని వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలను సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలు వస్తే చాలు... అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ కేసీఆర్ బీసీలకు తాయిలాలు ప్రకటిస్తారని, కానీ వారికి ఒక్క పైసా కూడా ఇవ్వరని వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం కేసీఆర్ ఆటలు సాగవని, ఆయనకు గుణపాఠం చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. హైదరాబాదులోని ఉప్పల్ భగాయత్ లో కుల సంఘాలకు కేటాయించిన స్థలాలను పరిశీలించిన సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కు ఎన్నికల సమయంలోనే కులాలు గుర్తుకు వస్తాయని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు వస్తుండడంతో ఇప్పుడు యాదవులు, గిరిజనులు అంటున్నారని విమర్శించారు. బీసీలను సీఎం కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని, బీసీ భవనాలకు ఇచ్చిన భూముల్లో గడ్డి మొలిచిందే తప్ప, ఒక్క పనీ జరగలేదని తెలిపారు. తొమ్మిది నెలల్లో ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం, ఆత్మగౌరవ భవనాలను ఎందుకు కట్టరని ప్రశ్నించారు. ఉప్పల్ భగాయత్ నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని అన్నారు.

టీఆర్ఎస్ మునిగిపోయే నావ, సీఎంగా కేసీఆర్ ఉన్నా, ఆయన కొడుకు ఉన్నా వాళ్లు చేసేదేమీ లేదని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక, కేసీఆర్ ను తెలంగాణ గాంధీ అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు అభివర్ణించడం పట్ల కూడా బండి సంజయ్ స్పందించారు. సీఎం కేసీఆర్ గాంధీ కాదని, కాలాంతకుడని పేర్కొన్నారు.


More Telugu News