మా తలపై రెండు శత్రు దేశాలు కూర్చున్నాయి: గులాం నబీ ఆజాద్

  • జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని చెప్పారు
  • యూటీ హోదాను కొనసాగించాలని అనుకుంటున్నారా?
  • జమ్మూకశ్మీర్ ప్రజలు భారత్ తోనే ఉన్నారు
జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, కేంద్రపాలిత ప్రాంతం హోదాను కొనసాగించాలని అనుకుంటున్నారా? అని కేంద్రాన్ని నిలదీశారు. జమ్మూకశ్మీర్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... అలాంటప్పుడు ఈ బిల్లుతో అవసరమేముందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోయిందని, నిరుద్యోగిత పెరిగిందని చెప్పారు.

జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించి, ఎన్నికలను నిర్వహించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్, చైనా సరిహద్దులకు ఆనుకుని జమ్మూకశ్మీర్ ఉందని... శత్రుదేశాలు తమ తలలపై కూర్చున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికుల మనసులను గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజలంతా భారత్ వెంటే ఉన్నారని... కశ్మీర్ ను సొంతం చేసుకునేందుకు 1948లో పాకిస్థాన్ యత్నించినప్పుడు... కశ్మీర్ కు చెందిన మహిళలు, పిల్లలతో సహా అందరూ వ్యతిరేకించారని అన్నారు. జమ్మూకశ్మీర్ కి రాష్ట్ర హోదా కల్పించాలని కోరారు.


More Telugu News