అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేసిన సోంపేట కోర్టు

  • నిమ్మాడలో వైసీపీ మద్దతిస్తున్న సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు ఆరోపణలు
  • కోటబొమ్మాళి పీఎస్ లో అచ్చెన్నపై కేసు నమోదు
  • అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు
ఇటీవల వైసీపీ మద్దతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరైంది. అచ్చెన్నాయుడితో పాటు 21 మందికి శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన రేపు జైలు నుంచి విడుదల కానున్నారు.

కొన్నిరోజుల కిందట నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిగా కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకున్నారని అచ్చెన్నపై ఆరోపణలు వచ్చాయి. అప్పన్న... అచ్చెన్నాయుడి అన్న కుమారుడే. అయితే వైసీపీ మద్దతుతో పంచాయతీ ఎన్నికల బరిలో దిగారు. పోటీచేయొద్దంటూ అప్పన్నను అచ్చెన్నాయుడు ఫోన్ లో బెదిరించారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై కోటబొమ్మాళి పీఎస్ లో కేసు నమోదు కాగా, అచ్చెన్న సహా అనేకమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.


More Telugu News