అంత లెక్కలేని సీఎం పదవి కోసం ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో?: కేసీఆర్ పై విజయశాంతి విసుర్లు

  • సీఎం పదవిపై స్పష్టత నిచ్చిన కేసీఆర్
  • టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు
  • కేసీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందన
  • ప్రాంతీయ పార్టీలు లేకుండా చేశారని ఆగ్రహం
  • కోవర్టు ఆపరేషన్లు చేయించారని ఆరోపణ
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు. టీఆర్ఎస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని కేసీఆర్ అన్నట్టు వార్తలు వచ్చాయని, అయితే, ఇతర ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించకుండా కోవర్టు ఆపరేషన్లు చేపట్టిన ఘనత కేసీఆర్ దేనని ఆరోపించారు. కుట్రలు, అబద్ధపు ప్రచారాలతో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారని, ఆపై తెలంగాణ ఐక్యత పేరుతో చర్చలంటూ ఆ పార్టీలను విలీనం చేశారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. ఇప్పుడా పార్టీలనే లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక సీఎం మార్పు అంశంలో కేసీఆర్ టీఆర్ఎస్ నేతలను కోప్పడినట్టు వస్తున్న వార్తలపైనా విజయశాంతి తన అభిప్రాయాలు వెల్లడించారు. తన కుర్చీ కుమారుడికి మారుతుందని అన్నందుకే మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి నేతలను బండకేసి కొడతానని, పార్టీ నుంచి వెళ్లగొడతానని తిట్టారని వివరించారు.

సీఎం పదవి తన ఎడం కాలి చెప్పుతో సమానం అని చెప్పడం విడ్డూరం అని, అంత లెక్కలేని దానికి ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో? అని వ్యాఖ్యానించారు. సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత అసహనం వ్యక్తం చేస్తున్న కేసీఆర్... అయోధ్య గురించి, ఉద్యోగుల గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తే కనీసం ఖండించకపోవడం గమనార్హం అని విజయశాంతి పేర్కొన్నారు.


More Telugu News