రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు

  • మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయన్న విజయసాయి
  • తన మనసు ప్రజలతో మమేకమై ఉందన్న వెంకయ్యనాయుడు
  • తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని వ్యాఖ్యలు
ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి... ఇప్పుడు ఏకంగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని టార్గెట్ చేశారు. ఈరోజు రాజ్యసభలో విజయసాయి మాట్లాడుతూ, చైర్మన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయి' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వెంకయ్యనాయడుడు ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ప్రస్తుతం ఏ పార్టీకి చెందినవాడిని కాదని వెంకయ్య అన్నారు. ఉపరాష్ట్రపతి ప్రతిపాదన వచ్చిన వెంటనే, బీజేపీకి తాను రాజీనామా చేశానని చెప్పారు. అప్పటి నుంచి తాను రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదని అన్నారు. తన మనసు ప్రజలతో మమేకమై ఉందని చెప్పారు. విజయసాయి వ్యాఖ్యలు తనను బాధించాయని చెప్పారు. అయితే, ఎవరేమన్నా తాను పట్టించుకోనని అన్నారు.

ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే... ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలని విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తారు. అయితే విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను వెంకయ్యనాయుడు తిరస్కరించారు. దీంతో, వైసీపీ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. ఈ సందర్భంగానే చైర్మన్ పై విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా స్పందించారు. విజయసాయిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని అంతటితో వదిలేశారు.


More Telugu News