పోస్కో కంపెనీతో జగన్ చర్చలు జరిపిన విషయం కేంద్రానికి తెలుసు: బోండా ఉమ

  • విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొట్టేసేందుకు జగన్ నాటకాలు ఆడుతున్నారు
  • 2019 అక్టోబరులో పోస్కో కంపెనీతో చర్చలు జరిపారు
  • 2 లక్షల కోట్ల ఫ్యాక్టరీని కేవలం 5 వేల కోట్లకే కొట్టేసేందుకు చర్చలు జరిపారు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొట్టేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. దీనికి సంబంధించి తెర వెనుక మొత్తం రంగాన్ని జగన్ సిద్ధం చేసుకున్నారని చెప్పారు. 2019 అక్టోబర్ 29వ తేదీన తన నివాసంలో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీతో జగన్ చర్చలు జరిపారని తెలిపారు. రూ. 2 లక్షల కోట్ల విలువైన స్టీల్ ఫ్యాక్టరీని కేవలం రూ. 5 వేల కోట్లకే కొట్టేసేందుకు సదరు కంపెనీ ప్రతినిధులతో జగన్ చర్చలు జరిపారని ఆరోపించారు. ఇన్ని చేసిన జగన్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్రానికి లేఖ రాశానంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

పోస్కో కంపెనీతో జగన్ చర్చలు జరిపిన విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసని... దీనికి అనుగుణంగానే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై పార్లమెంటులో కేంద్రం నుంచి ప్రకటన వెలువడిందని ఉమ తెలిపారు. కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన తర్వాత తనకు ఏమీ తెలియదన్నట్టుగా జగన్ లేఖ రాశారని ఎద్దేవా చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో జగన్ కు సంబంధం లేకపోతే వైసీపీకి చెందిన 28 మందితో రాజీనామాలు చేయించి, కేంద్రంపై పోరాడాలని సవాల్ విసిరారు. అప్పుడు వైసీపీ బాటలోనే టీడీపీ కూడా నడుస్తుందని అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారంపై టీడీపీ ఏం చేసిందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని... ఈ ప్రశ్నలు వేసే వారికి 1998, 2000లో పార్లమెంటు కేంద్రంగా టీడీపీ ఎంపీలు చేసిన డిమాండ్లు సమాధానం చెపుతాయని తెలిపారు. ఇవేవీ తెలియకుండా వైసీపీ ఎంపీలు టీడీపీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.


More Telugu News