మీ డ‌బ్బు పిచ్చికోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వాడుకోకండి: బోండా ఉమ‌

  • ప్రైవేటు ప‌రం చేయొద్దు 
  • ఉక్కు క‌ర్మాగారాన్ని మ‌న పెద్ద‌లు సాధించారు
  • వారి త్యాగాల‌కు వైసీపీ ప్ర‌భుత్వం విలువ ఇవ్వ‌ట్లేదు
  • త‌మ‌కు డ‌బ్బే ముఖ్య‌మ‌నేలా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది
విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌ర‌ణ చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ నిర్ణ‌యాన్ని తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని టీడీపీ నేత బోండా ఉమ తెలిపారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. డ‌బ్బు పిచ్చికోసం విశాఖ స్టీల్ ప్లాంటును వైసీపీ వాడుకోకూడదని అన్నారు.

తమ పార్టీ నేత నారా లోకేశ్ ఇప్ప‌టికే ఈ విష‌యంపై సీఎంకి లేఖ రాశారని చెప్పారు. వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నార‌ని అడిగారని, కొంతైనా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయండని కోరార‌ని తెలిపారు. ఎంతో మంది ప్ర‌జ‌ల త్యాగ ఫ‌లితం విశాఖ స్టీల్ ప్లాంట‌ని చెప్పారు.

కేంద్ర ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేయాలని బోండా ఉమ తెలిపారు. ఉద్యోగుల భ‌విష్య‌త్తు పాడుకాకుండా చేయాల‌న్నారు.  ఉక్కు క‌ర్మాగారాన్ని మ‌న పెద్ద‌లు సాధించారని, వారి త్యాగాల‌కు వైసీపీ ప్ర‌భుత్వం విలువ ఇవ్వ‌ట్లేదని ఆరోపించారు. సాధించుకున్న దాన్ని ప్రైవేటు ప‌రం చేస్తుంటే వైసీపీ చూస్తూ ఊరుకుంటోంద‌ని చెప్పారు.

త‌మ‌కు డ‌బ్బే ముఖ్య‌మ‌నేలా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోందని, వైసీపీకి చిత్త శుద్ధి ఉంటే ఎంపీలను రాజీనామా చేయ‌మ‌నాల‌ని జ‌గ‌న్ కు సూచించారు. త‌మ పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తార‌ని చెప్పారు. వైసీపీ వ‌ల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు ప‌రం అవుతోందని ఆరోపించారు. వారి కుట్ర‌లో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ మ‌న‌కు దూర‌మ‌వుతోందని విమర్శించారు.


More Telugu News