రాజ్యసభలో పోలవరం అంశాన్ని లేవనెత్తిన విజయసాయిరెడ్డి... బదులిచ్చిన కేంద్రమంతి షెకావత్

  • కొనసాగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి
  • అంచనా వ్యయాన్ని ఎప్పట్లోగా ఆమోదిస్తారని ప్రశ్న
  • కేబినెట్ నిర్ణయం కోసం అంచనాలను పంపుతామన్న షెకావత్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాజ్యసభ సమావేశాల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక సలహా కమిటీ సవరించిన మేరకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయాన్ని ఎప్పటిలోగా ఆమోదిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరించాలని కోరారు. పోలవరం కోసం ప్రత్యేకంగా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని, నిధుల విడుదల సాఫీగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బదులిచ్చారు. 2017 లెక్కల ప్రకారం ధరల సవరణ కమిటీ అంచనాలను రూపొందించిందని తెలిపారు. ఆ కమిటీ అంచనాలను పరిశీలించి కేబినెట్ ఆమోదం కోసం పంపుతామని, కేబినెట్ నిర్ణయించిన ప్రకారం సవరించిన అంచనాలపై కేంద్రం చర్యలు ఉంటాయని షెకావత్ వివరించారు.


More Telugu News