బొత్స సోదరుడిపై వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలు

  • నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలు
  • బొత్స సోదరుడు పార్టీలో చిచ్చు పెడుతున్నారన్న బడ్డుకొండ
  • అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానన్న అప్పలనాయుడు
పంచాయతీ ఎన్నికల తరుణంలో వైసీపీలో పలు చోట్ల వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మంత్రులు, బొత్స, అనిల్ యాదవ్ ల సమక్షంలోనే ఎమ్మల్యే ఆర్థర్, నియోజకవర్గ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు ఘర్షణ పడ్డారు.

తాజాగా నెల్లిమర్ల నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావుపై వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నిప్పులు చెరిగారు. బొత్స సోదరుడు టీడీపీతో కుమ్మక్కయ్యారని అప్పలనాయుడు మండిపడ్డారు. వైసీపీని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని అన్నారు.

వారి కుటుంబంలో ఇప్పటికే అన్నకి, వదినకి, మరో సోదరుడికి పదవులు ఉన్నప్పటికీ... లక్ష్మణరావు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బులు ఎక్కువైతే దానధర్మాలు చేసుకోవాలే తప్ప... గ్రూపు రాజకీయాలు చేస్తూ సొంత పార్టీలోనే చిచ్చు పెడతారా? అని దుయ్యబట్టారు.

దీనిపై మంత్రి బొత్సకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే నేరుగా పార్టీ అధిష్ఠానానికే ఫిర్యాదు చేస్తానని అన్నారు. అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి.


More Telugu News