నాలుగేళ్ల తరువాత... నేడు చెన్నైలో కాలుమోపనున్న చిన్నమ్మ!

  • అక్రమాస్తుల కేసులో శిక్ష పూర్తి
  • నేడు భారీ స్వాగత ఏర్పాట్ల మధ్య చెన్నైకి
  • 66 చోట్ల వేదికలు ఏర్పాటు చేసిన అభిమానులు
దాదాపు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ, నేడు తిరిగి చెన్నైలో కాలుమోపనున్నారు. ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.

బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లే రహదారిపై 66 చోట్ల స్వాగత ద్వారాలను, వేదికలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు శశికళతో సంప్రదింపులు జరిపారని, వీరిలో కొందరు సీనియర్ మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పటికే శశికళ తిరిగి రంగ ప్రవేశంపై తమిళనాడులో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకేలో సైతం ప్రకంపనలు వస్తున్నాయి. గత నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కాగా, ఆపై చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకున్న ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నేతలు సిద్ధమయ్యారు. ఆమె రాగానే అన్నాడీఎంకేలో చీలిక రావచ్చని కూడా తెలుస్తోంది.

ఇక మరికాసేపట్లో భారీ కాన్వాయ్ తో బెంగళూరు నుంచి శశికళ రోడ్డు మార్గంలో చెన్నైకి బయలుదేరనున్నారు. తమిళనాడు సరిహద్దు అత్తిబెలె నుంచి చెన్నై వరకూ ఆమెపై పూలవర్షం కురిపించేందుకు అనుచరగణం సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మంది శశికళ అభిమానులు, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నేతలు రహదారులపైకి చేరుకున్నారు. బెంగళూరు నుంచి తమిళనాడు సరిహద్దుల వరకూ కర్ణాటక పోలీసులు శశికళకు భద్రత కల్పించనుండగా, ఆపై తమిళనాడు పోలీసులు ఆమెను చెన్నైకి చేర్చనున్నారు.

ఇక ఆమెను తీసుకుని వచ్చేందుకు జయలలిత ఎప్పుడూ వాడే కారు ఇప్పటికే బెంగళూరుకు చేరుకుంది. అత్తిబెలె వరకూ అదే వాహనంలో ప్రయాణించనున్న శశికళ, ఆపై ఓపెన్ టాప్ వ్యాన్ లో చెన్నైకి రానున్నారు. మార్గమధ్యంలోని పలు ప్రాంతాల్లో సత్కార సభలు నిర్వహించనున్నారు. తిరుపత్తూరు, వేలూరు, రాణిపేట, కాంచీపురం జిల్లాల మీదుగా శశికళ కాన్వాయ్ సాగనుంది. మార్గమధ్యంలో చండీ మేళం, కీలు గుర్రాల ప్రదర్శన, నెమలి నృత్యాలు, పులి వేషాలు, మంగళ వాయిద్యాలు తదితరాలను ఏర్పాటు చేశారు.

ఇక, చెన్నైలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో, స్వాగత సభలను పోలీసులు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే, చెన్నై శివార్ల వరకూ మాత్రమే ఆమెకు అభిమానులు స్వాగతం పలికే అవకాశాలు ఉన్నాయి. ఆపై చెన్నై మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని, ఎంజీఆర్ ఇంటిని ఆమె సందర్శించనున్నారు. ఆమె రాక మొత్తాన్ని వీడియో తీయాలని పోలీసులు నిర్ణయించారు. స్వాగతం తెలిపే ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరగవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News