నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన తపోవన్ జలాశయం!

  • రూ. 3 వేల కోట్ల నష్టం 
  • పూర్తిగా నాశనమైన డ్యామ్, జల విద్యుత్ కేంద్రం
  • సర్వే నిర్వహించిన భారత వాయుసేన
ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడిన కారణంగా చెలరేగిన జల విలయం తపోవన్ డ్యామ్ ను, జలాశయాన్ని నామరూపాల్లేకుండా చేసింది. ప్రాధమిక సర్వే అనంతరం 520 మెగావాట్ల తపోవన్ విష్ణుగద్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. దీని విలువ దాదాపు రూ. 3 వేల కోట్లు కావడం గమనార్హం.

మంచు చరియలు విరిగిపడిన నష్టంపై అంచనా వేసేందుకు భారత వాయుసేన ఏరియల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జలాశయం, డ్యామ్ అసలు కనిపించలేదు. విమానాల్లో సర్వేకు వెళ్లిన అధికారులు, డెహ్రాడూన్ కు 280 కిలోమీటర్ల దూరంలోని ధౌలీ గంగా, రిషి గంగా నదులను పరిశీలించారు. మలరీ తపోవన్ జలాశయం వద్ద నిర్మించిన మలరీ లోయకు వెళ్లే రెండు వంతెనలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి.

జోషిమఠ్, తపోవన్ మధ్య ఉన్న రహదారి కూడా నాశనం అయిందని, ఇక్కడి లోయలో ఉన్న జనావాస నిర్మాణాలు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. నందాదేవి పర్వతంపై ఉన్న కొండ చరియలు విరిగి పడటమే ఇంత ప్రమాదానికి కారణమని, ఈ చరియలు పిపిల్ కోటి, చమోలీ నుంచి కిందకు జారి ధౌలీ గంగా, అలకనంద నదులపై పడ్డాయని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ డ్యామ్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ నిర్వహిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న 170 మంది గల్లంతు కాగా, రిషి గంగా నదీ తీరంలో ఉన్న రైనీ గ్రామం పూర్తిగా నాశనమైంది.

ఇక్కడ నివాసం ఉంటున్న వారిలో చాలా మంది జాడ ఇంకా తెలియరాలేదు. పరిస్థితిని పరిశీలిస్తున్నామని, మంచు పర్వతాల నుంచి చరియలు విరిగి పడిన ఘటన పెను ప్రభావాన్నే చూపిందని డ్యామ్ లో ఓ వైపు పూర్తిగా నాశనమైందని ఎన్టీపీసీ పేర్కొంది. కాగా, ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు రావడం, ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై పర్యావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక్కడి ప్రాజెక్టులను మరోమారు పరిశీలించాలని, పర్వతాలపై అధ్యయనం చేయాలని డిమాండ్ చేశాయి.


More Telugu News