పెట్టుబడుల ఉపసంహరణ ఆషామాషీగా జరిగే ప్రక్రియ కాదు: నిర్మలా సీతారామన్

  • ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ
  • పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం
  • దేశంలోని పలు ప్రాంతాల నుంచి వ్యతిరేకత
  • వివరణ ఇచ్చిన నిర్మలా
  • విస్తృత సంప్రదింపులు ఉంటాయని వెల్లడి
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడమే కాకుండా, ఆ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల దేశంలోని పలు ప్రాంతాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఉద్యమం రూపుదాల్చుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ నిర్ణయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ అంచెలంచెలుగా జరుగుతుందని చెప్పారు. పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుగుతాయని, ఆ తర్వాతే ఉపసంహరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రతి దశలోనూ తనిఖీలు ఉంటాయని వివరించారు. ఈ ప్రక్రియ యావత్తు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఇష్టానుసారం సంస్థలను ఎంపిక చేయలేదని తెలిపారు. ముంబయిలోని యోగి సభాగృహ వద్ద మీడియాతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News