పంత్, పుజారా అర్ధసెంచరీలు... భారత్ ఇంకా ఎదురీతే!

  • చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 578 ఆలౌట్
  • టీ బ్రేక్ సమయానికి భారత్ 154/4
  • దూకుడుగా ఆడుతున్న పంత్
  • క్రీజులో పాతుకుపోయిన పుజారా
చెన్నై టెస్టులో భారత్ ఎదురీత కొనసాగుతోంది. తొలిఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 578 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మధ్యాహ్నం టీ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా 53, రిషబ్ పంత్ 54 పరుగులతో క్రీజులో ఉన్నారు. ముఖ్యంగా పంత్ వన్డే తరహా ఆటతీరుతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 44 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. క్రీజులో పాతుకుపోయిన పుజారా 111 బంతుల్లో 53 పరుగులు చేయగా, పంత్ 44 బంతుల్లోనే 54 పరుగులు సాధించడం అతడి దూకుడుకు నిదర్శనం.

ఇక, సుదీర్ఘ విరామం తర్వాత బరిలో దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 48 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేశాడు. కోహ్లీని ఇంగ్లండ్ స్పిన్నర్ డామ్ బెస్ అవుట్ చేశాడు. వైస్ కెప్టెన్ రహానే (1) సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటై నిరాశ పరిచాడు. ఈ వికెట్ కూడా బెస్ కే దక్కింది. అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ 6 పరుగులకు, మరో ఓపెనర్  శుభ్ మాన్ గిల్ 29 పరుగులకు ఆర్చర్ బౌలింగ్ లో వెనుదిరిగారు. కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 424 పరుగులు వెనుకబడి ఉంది.


More Telugu News