గగన్​ యాన్​ వ్యోమగాములు దిగేది మన దేశంలోనే.. గుజరాత్​ లో ల్యాండింగ్​: ఇస్రో స్పేస్​ అప్లికేషన్​ సెంటర్​

  • వెరావల్ తీరాన్ని ఎంపిక చేశామన్న సంస్థ డైరెక్టర్
  • ప్రత్యామ్నాయంగా బంగాళాఖాతంలోని తీరమూ ఎంపిక
  • 15 నుంచి 20 నిమిషాల్లోపు క్వారంటైన్ కు వ్యోమగాముల తరలింపు
ఈ ఏడాది చివరి నాటికి మానవ రహిత గగన ప్రయాణానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైపోతోంది. ఆ తర్వాత వచ్చే ఏడాదే మనిషినీ అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ‘గగన్ యాన్’ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లనూ చకచకా చేసుకుంటోంది. అంతరిక్షంలోకి పంపుతాం సరే.. మరి, ల్యాండింగ్ ఎక్కడ? గగన్ యాన్ ప్రయోగ ప్రకటన వచ్చిన తర్వాత.. చాలా మంది ఆ ప్రయోగం గురించి ఆలోచించి ఉంటారే తప్ప, ల్యాండింగ్ గురించి ఆలోచన తట్టి ఉండదు.

మామూలుగా అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన వ్యోమగాములను కజకిస్థాన్ లోని ఓ ఎడారిలోనో లేదంటే పసిఫిక్ మహా సంద్రంలోనో ల్యాండ్ చేస్తుంటారు. అయితే, మన గగన్ యాన్ వ్యోమగాములను మాత్రం మన దేశంలోనే దింపాలని ఇస్రో సంకల్పించింది. దీనికి సంబంధించి అహ్మదాబాద్ లోని ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ ప్రకటన చేశారు. స్పేస్ గీక్స్ ముంబై, ఇతర సంస్థలు కలిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

గుజరాత్ లోని వెరావల్ తీరంలో గగన్ యాన్ వ్యోమగాములను ల్యాండింగ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామన్నారు. ఇక, దానికి ప్రత్యామ్నాయంగా బంగాళాఖాతంలోని మరో తీరాన్నీ ఎంపిక చేసి పెట్టామన్నారు. ఎక్కడ ల్యాండ్ చేస్తారన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. ల్యాండ్ అయిన 15 నుంచి 20 నిమిషాల లోపు వ్యోమగాములను క్వారంటైన్ కేంద్రానికి తీసుకెళ్తామని చెప్పారు. క్వారంటైన్ కేంద్రంలో వారి ఆరోగ్య వివరాలను పరిశీలించి, అంతా బాగుంది అనుకున్న తర్వాతే ప్రయోగం విజయవంతమైందని ప్రకటిస్తామన్నారు.

కరోనా కారణంగా గగన్ యాన్ ప్రయోగంలో స్వల్ప మార్పులు జరిగినట్టు దేశాయ్ చెప్పారు. జీఎస్ ఎల్వీ మార్క్ 3 రాకెట్ లో బరువు ప్రమాణాల ఆధారంగా సిబ్బందిని పంపించే వాహక పరిమాణాన్ని తగ్గించాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రష్యాలో శిక్షణ తీసుకుంటున్న వ్యోమగాముల్లో నుంచి ఇద్దరు లేదా ముగ్గురిని అంతరిక్షంలోకి పంపిస్తామన్నారు. కాగా, చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా పంపిన ఆర్బిటర్ మరో ఏడున్నరేళ్లు పనిచేస్తుందని, ఇంధన ఆదా వల్లే దాని జీవిత కాలం పెరిగిందని తెలిపారు. దీనితో చంద్రుడి గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు దోహద పడుతుందన్నారు.

కాగా, భూ కక్ష్యకు 275 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోకి వారిని ఇస్రో పంపించనుంది. దాదాపు వారం రోజుల పాటు సాగే ఈ ప్రయోగంలో ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు.. అంతరిక్షంలోని వ్యోమగాములు మన దేశం మీదుగా వెళ్తారు. ఈ మిషన్ మొత్తాన్ని కర్ణాటకలోని హసన్ లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ లు పర్యవేక్షించనున్నాయి.


More Telugu News