ప్రకాశం జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యపై పవన్ కల్యాణ్ స్పందన

  • ఒంగోలులో తేజస్విని అనే విద్యార్థిని ఆత్మహత్య
  • ఫీజు బకాయిలు చెల్లించలేక బలవన్మరణం
  • ఈ ఘటన బాధాకరమన్న పవన్ కల్యాణ్
  • ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
ప్రకాశం జిల్లా ఒంగోలులో తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఫీజు బకాయిల వల్ల పరీక్షలు రాయలేని పరిస్థితిలో తేజస్విని అనే సెకండియర్ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పవన్ పేర్కొన్నారు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే తేజస్విని బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు.

విద్యకు పేదరికం అడ్డు కారాదానే ఉద్దేశంతోనే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ప్రారంభమైందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా పేదలకు చదువును దూరం చేసేలా వ్యవహరిస్తోందని తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు రాలేదు కాబట్టి పరీక్షలకు అనుమతించబోమని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయని, దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని వివరించారు.

కొన్ని రోజుల కిందట కూడా ఒంగోలు క్విస్ కాలేజీ ఇదే విధంగా వ్యవహరిస్తే జనసేన పేద విద్యార్థుల పక్షాన నిలిచిందని తెలిపారు. ఇప్పుడు అలాంటి సమస్యతోనే తేజస్విని ఆత్మహత్యకు పాల్పడిందని, ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించాలని, తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.


More Telugu News