వైసీపీ వంటి చిన్న పార్టీలను చాలా చూశాం: విష్ణువర్ధన్ రెడ్డి

  • తమపై వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు వైసీపీకి లేదన్న విష్ణు
  • బీజేపీ నేతలు, కార్యకర్తల పట్ల వైసీపీ వైఖరి సరిగాలేదని విమర్శలు
  • పక్క రాష్ట్రానికి వెళితే వైసీపీ అంటే ఎవరికీ తెలియదని వ్యంగ్యం
  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు టీడీపీకి లేదని వెల్లడి
కడప జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అధికార వైసీపీపై ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తల పట్ల వైసీపీ ధోరణి సరిగా లేదని విమర్శించారు. వైసీపీ వంటి చిన్న పార్టీలను చాలా చూశామని, పక్క రాష్ట్రానికి వెళితే వైసీపీ అంటే ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఓట్ల గురించి మాట్లాడే వైసీపీ, టీడీపీ నేతలు... ఢిల్లీలో బీజేపీ నేతల అపాయింట్ మెంట్ కోసం బారులు తీరుతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రజలను దోచుకునే పార్టీ టీడీపీ

ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీరణ చేయనున్న నేపథ్యంలోనూ విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై మండిపడ్డారు. ప్రజలను దోచుకునే పార్టీ టీడీపీ అని విమర్శించారు. చంద్రబాబు హయాంలో నిజాం షుగర్ పరిశ్రమను ఎత్తివేయలేదా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు టీడీపీకి లేదని అన్నారు.

కరోనా వ్యాపిస్తున్న సమయంలో రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రంలో కూర్చుని ట్వీట్లు చేసే వ్యక్తులు బీజేపీ గురించి మాట్లాడడమేంటని నిలదీశారు. జూమ్ యాప్ లో ప్రసంగాలు చేసే పెద్దమనిషి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడని, తెలుగు చదవడమే రాని వ్యక్తి ట్వీట్లు చేస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం అంశంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


More Telugu News