చెన్నైలో ద్విశతకం బాదేసిన ఇంగ్లండ్ బ్యాట్స్​ మన్​ జో రూట్

  • గత మూడు టెస్టులలో రెండో డబుల్ సెంచరీ
  • టీ విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 454/4
  • వికెట్లు తీసేందుకు శ్రమిస్తున్న భారత బౌలర్లు
చెన్నై టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్ చెలరేగిపోతున్నాడు. తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. భారత బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొంటున్నాడు. బుమ్రా, అశ్విన్, ఇషాంత్ వంటి అగ్రశ్రేణి బౌలర్లనూ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. ఫలితంగా మొదటి టెస్టు రెండో రోజు రూట్ తనదైన శైలిలో ద్విశతకం సాధించాడు. అశ్విన్ వేసిన 143వ ఓవర్ 3వ బంతికి సిక్సర్ కొట్టి.. డబుల్ సెంచరీ మార్కును దాటాడు.

50 నుంచి 100 పరుగులకు చేరడానికి చాలా సమయం తీసుకున్న రూట్.. 100 నుంచి 200కు రావడానికి మాత్రం కొద్ది సమయమే తీసుకున్నాడు. 341 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. రూట్ కు కెరీర్ లో ఇది ఐదో డబుల్ సెంచరీ కాగా.. చివరి మూడు టెస్టుల్లో రెండోది కావడం విశేషం. ప్రస్తుతం టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది.

రూట్ 2 సిక్సర్లు, 19 ఫోర్ల సాయంతో 209 పరుగులు (353 బంతులు)తో క్రీజులో పాతుకుపోయాడు. అతడికి ఓలీ ఫిలిప్ (24, 2 ఫోర్లు) చక్కటి సహకారం అందిస్తున్నాడు. రూట్ వికెట్ తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికెట్ల కోసం రివ్యూలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మూడు సమీక్షలూ వృథా అయ్యాయి.


More Telugu News