నలుపు, తెలుపుల అరుణ గ్రహం.. చిత్రాన్ని ఒడిసిపట్టిన చైనా వ్యోమనౌక

  • 22 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఫొటో
  • శుక్రవారం ల్యాండర్ కక్ష్య సవరించుకుందన్న చైనా అంతరిక్ష సంస్థ
  • ఫిబ్రవరి 10 లోపు వేగం తగ్గించుకుంటుందని వెల్లడి
  • మేలో దానిని అంగారకుడిపై దింపేందుకు చైనా ప్రయత్నాలు
అంగారక గ్రహం అనగానే.. ఎర్రని కొండలు, గుట్టలు, మట్టితో కూడిన అరుణ గ్రహమే గుర్తొస్తుంది. ఇప్పటిదాకా చూసిన చిత్రాలూ అలాగే ఉన్నాయి. కానీ, ఎప్పుడైనా ఆ కుజుడే నలుపు, తెలుపుల సంగమంతో ఉండడం చూశారా! అలాంటి ఫొటోనే చైనా విడుదల చేసింది.

గత ఏడాది జూలై 23న అంగారక గ్రహంపై పరిశోధనల కోసం చైనా జాతీయ అంతరిక్ష సంస్థ (సీఎన్ఎస్ఏ) తియాన్వెన్ 1 ప్రయోగాన్ని చేపట్టింది. విజయవంతంగా వ్యోమనౌక (రోవర్ సహిత ల్యాండర్)ను పంపించింది. ఈ ఏడాది మే నాటికి అరుణ గ్రహంపైన దానిని దిగ్విజయంగా దింపేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి.. మార్స్ పై కలియతిరుగుతుంది.

అయితే, ఈ లోపు తియాన్వెన్ తన పనులు కానిచ్చేస్తోంది. అందులో భాగంగానే అంగారక గ్రహాన్ని చిత్రీకరించింది. 22 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వ్యోమనౌకలోని కెమెరాలు మార్స్ ను క్లిక్ మనిపించాయి. శుక్రవారమే వ్యోమనౌక తన కక్ష్యను సవరించుకుందని, అంగారకుడి గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యే ఫిబ్రవరి 10 లోపే దాని వేగాన్ని తగ్గించుకుంటుందని చైనా అంతరిక్ష సంస్థ పేర్కొంది. కాగా, ఒకవేళ మేలో తియాన్మెన్ 1 విజయవంతంగా మార్స్ పై దిగితే.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన దేశంగా చైనా చరిత్ర సృష్టించనుంది.


More Telugu News