కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడిపోయినా.. అతడికి మాత్రం దాని గురించి అస్సలు తెలియదు!

  • ప్రమాదంలో తలకు బలమైన గాయం
  • పది నెలలపాటు కోమాలో
  • ఆసుపత్రిలో ఉండగానే రెండుసార్లు సోకిన వైరస్
అవును నిజమే! ప్రపంచవ్యాప్తంగా ఏ మారుమూల ప్రాంతంలో అడిగినా కరోనా గురించి పుంఖానుపుంఖాలుగా చెప్పేస్తారు. ప్రపంచంలోని మూలమూలలకు పాకిన కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేసింది. జీవితాలను తలకిందులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని పొట్టనపెట్టుకున్న ఈ భూతం.. మరెంతో మందిని రోడ్డు పాలు చేసింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. ప్రపంచం ఇప్పుడిప్పుడే దాని బారి నుంచి నెమ్మదిగా బయటపడుతోంది.

ప్రపంచ స్థితి గతులను ఇంతలా మార్చేసిన ఈ మహమ్మారి గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారంటే అది.. 18 ఏళ్ల జోసెఫ్ ప్లావిల్ మాత్రమే. ఇంగ్లండ్‌కు చెందిన జోసెఫ్ గతేడాది మార్చి 1న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలంగా దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. బ్రిటన్ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ ప్రకటించింది.

కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోసెఫ్ వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులను అనుమతించలేదు. వైద్యులే అతడి ఆలనా పాలనా చూశారు. అంతేకాదు, ఆసుపత్రిలో కరోనా రోగుల తాకిడి పెరగడంతో జోసెఫ్ రెండుసార్లు ఆ మహమ్మారి బారినపడ్డాడట. అయితే, వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణ కారణంగా త్వరగానే బయటపడ్డాడు. అయినప్పటికీ కోమా నుంచి మాత్రం బయటపడలేకపోయాడు.

దాదాపు 10 నెలలపాటు కోమాలో ఉన్న జోసెఫ్ ఇటీవల స్పృహలోకి రావడంతో వైద్యులు, కుటుంబ సభ్యులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పదినెలల కాలంలో ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకుని జోసెఫ్ ఆశ్చర్యపోయాడు. కరోనా సృష్టించిన విలయతాండవం గురించి తెలియకున్నా.. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు జోసెఫ్ సిద్ధమవుతున్నాడు.


More Telugu News