చెన్నై టెస్టు: భీకర ఫామ్ ను కొనసాగిస్తూ భారత్ పై సెంచరీ బాదిన ఇంగ్లండ్ కెప్టెన్

  • చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు
  • ముగిసిన మొదటిరోజు ఆట
  • 128 పరుగులతో అజేయంగా నిలిచిన రూట్
  • ఇంగ్లండ్ స్కోరు 3 వికెట్లకు 263 పరుగులు
  • 87 పరుగులు చేసిన ఓపెనర్ డామ్ సిబ్లే
  • బుమ్రాకు 2 వికెట్లు
టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు బాదడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా అదేమీ అసాధ్యం కాదు. ఆ విషయం ఇవాళ చెన్నై టెస్టులో నిరూపితమైంది.

ఇటీవల శ్రీలంకపై రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు బాదిన రూట్.. తన భీకర ఫామ్ ను భారత్ కు కూడా మోసుకొచ్చాడు. టీమిండియాతో చెన్నైలో నేడు మొదలైన తొలి టెస్టులో మొదటి రోజే తన తడాఖా చూపించాడు. భారత బౌలర్లకు సవాల్ గా నిలిచిన రూట్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి 128 పరుగులతో అజేయంగా నిలిచాడు.

తొలి సెషన్ లో నిదానంగా బ్యాటింగ్ చేసి విసుగెత్తించిన ఇంగ్లండ్, మధ్యాహ్నం తర్వాత కాస్త జోరు పెంచింది. అందుకు కారణం జో రూట్. కళాత్మకతకు నైపుణ్యాన్ని జోడిస్తూ సాగిన రూట్ బ్యాటింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 197 బంతులాడిన రూట్ 14 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అన్నట్టు... ఇది రూట్ కు వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం.

ఇక, ఇంగ్లండ్ జట్టు విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రూట్ సెంచరీ, ఓపెనర్ డామ్ సిబ్లీ (87) అర్ధసెంచరీ సాయంతో తొలి రోజు ఆట చివరికి మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఆటకు చివరి బంతికి సిబ్లే అవుటయ్యాడు. మరో ఓపెనర్ రోరీ బర్న్స్ 33 పరుగులు చేశాడు. బుమ్రాకు రెండు వికెట్లు, అశ్విన్ కు ఓ వికెట్ లభించింది.

ఇక, రేపటి ఆటలో ఇంగ్లండ్ ఇదే పంథా అనుసరించి భారీ స్కోరు సాధిస్తే ఆతిథ్య భారత్ పై ఒత్తిడి పెంచేందుకు వీలవుతుంది. అలాకాకుండా ఉదయం సెషన్ లో వెంటవెంటనే వికెట్లు కోల్పోతే భారత్ కు లాభిస్తుంది.


More Telugu News