విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే జగన్ మౌనం దాల్చడం దేనికి సంకేతం?: నారా లోకేశ్

  • విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం 
  • స్వప్రయోజనాల కోసం తాకట్టుపెడుతున్నారన్న లోకేశ్ 
  • స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్య 
  • విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటామని ఉద్ఘాటన
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై లోకేశ్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు.

32 మంది ప్రాణ త్యాగాలతో సాకారం అయిన స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. దీని ద్వారా వేలమంది ప్రత్యక్షంగా, లక్షలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మణిహారంగా వెలుగొందుతున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే సీఎం జగన్ రెడ్డి మౌనం దాల్చడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం? అని నిలదీశారు.

"పరిపాలన రాజధాని అంటే ఇలా ఒక్కొక్క పరిశ్రమను అమ్మేయడమేనా? అడవులు, కొండల్ని కబ్జాలు చేయడమేనా? కాకినాడ పోర్టును విజయసాయిరెడ్డి అల్లుడికి వరకట్నంగా రాసిచ్చేశారు. విశాఖ ఏజెన్సీలోని లేటరైట్ గనులను బాబాయ్ సుబ్బారెడ్డికి బహూకరించారు. తన దోపిడీ మత్తుకు మంచింగ్ గా మచిలీపట్నం పోర్టును నంజుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకు కొని దోపిడీ వికేంద్రీకరణ పరిపూర్ణం చేసుకోబోతున్నారు" అంటూ లోకేశ్ విమర్శలు గుప్పించారు.


More Telugu News