సౌర వ్యవస్థలోని గ్రహాలన్నీ ఒకే వరుసలో.. ఫొటోలు విడుదల చేసిన నాసా!

సౌర వ్యవస్థలోని గ్రహాలన్నీ ఒకే వరుసలో.. ఫొటోలు విడుదల చేసిన నాసా!
  • చిత్రాలు క్లిక్ మనిపించిన సోలార్ ఆర్బిటర్, పార్కర్ సోలార్ ప్రోబ్
  • జూన్ 7న ఒకటి.. నవంబర్ 18న మరో ఫొటో
  • 25.1 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఫొటో తీసిన సోలార్ ఆర్బిటర్
మన సౌర వ్యవస్థలో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయని చిన్నప్పటి నుంచీ చదువుకుంటున్నాం. వలయాకారంలో గీతలు గీసి.. ఇక్కడిక్కడ ఇవి ఉంటాయనీ చూపించాం. మరి, నిజంగా అంతరిక్షంలో ఆ గ్రహాలన్నీ ఎలా ఉంటాయి? 25.1 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే అవి ఎలా కనిపిస్తాయి?.. ఇదిగో ఈ ప్రశ్నలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసానే సమాధానం చెప్పేసింది. సూర్యుడి చుట్టూ తిరిగే ఆ గ్రహాలను ఫొటోలు తీసింది.

సూర్యుడిపై పరిశోధనల కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), నాసా కలిసి పంపించిన సోలార్ ఆర్బిటర్, నాసా పంపించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌకలు గ్రహాల ఫొటోలను క్లిక్ మనిపించాయి. గత ఏడాది నవంబర్ 18న సోలార్ ఆర్బిటర్ లోని హీలియోస్ఫెరిక్ ఇమేజర్ (సోలోహెచ్ఐ).. భూమికి 25.1 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వాటి చిత్రాలను తీసింది. అయితే, ఆ ఫొటో ఫ్రేమ్ లో సూర్యుడు మాత్రం పడలేదు. ఈ ఫొటోలో శుక్రుడు, యురేనస్ (వరుణుడు), భూమి, అంగారక గ్రహాలు మాత్రమే కనిపించాయి.

ఇక, గత ఏడాది జూన్ 7న పార్కర్ సోలార్ ప్రోబ్ లోని వైడ్ ఫీల్డ్ ఇమేజర్ (విస్పర్).. ఆరు గ్రహాల అమరిక ఫొటోను చిత్రీకరించింది. అందులో సూర్యుడు కనిపించకపోయినా.. దాని వెలుతురు, హీలియో స్ఫియర్ ను విస్పర్ పట్టేసింది. అంగారకుడు, శని, గురుడు, శుక్రుడు, భూమి, బుధ గ్రహాల చిత్రాలను ఒడిసిపట్టింది.

ఈ సమయంలో ఆ ఉపగ్రహం సూర్యుడికి 1.16 కోట్ల కిలోమీటర్ల దూరంలో, భూమికి 15.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రహాలన్నీ వలయాకారంలోనే తిరిగినా.. ఆ రెండు ఉపగ్రహాలు తీసిన ఫొటోల్లో గ్రహాలన్నీ ఒకే వరుసలో ఉన్నట్టు కనిపించాయి.


More Telugu News