రైతు సంఘాల నేతలు రాజకీయ శత్రువుల తీరులో మాట్లాడుతున్నారు: విజయశాంతి విమర్శలు

  • కేంద్రంతో రైతుల చర్చలపై రాములమ్మ స్పందన
  • మోదీ ఎంతో సానుకూలంగా ఉన్నారని వెల్లడి
  • రైతు నేతల తీరుపై అసంతృప్తి
  • ఇలాంటి ప్రకటనలతో సమస్య జటిలం అవుతుందని వ్యాఖ్యలు
జాతీయ వ్యవసాయ చట్టాల అంశంలో కేంద్రం, రైతుల మధ్య చర్చల సరళిపై తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. రైతుల సంఘాల నేతల వైఖరిపై విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే సంఘటనల వరకు కూడా కేంద్రం రైతులతో చర్చలు కొనసాగిస్తూనే వచ్చిందని, ఇరుపక్షాలు అప్పటిదాకా ఎంతో సంయమనంతో వ్యవహరించాయని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటానని ప్రకటించారని, కానీ రైతు సంఘాల నేతలు మాత్రం వెనక్కి తగ్గుతారా? లేక, గద్దె దిగుతారా? అంటూ రాజకీయ శత్రువుల తీరులో మాట్లాడడం బాధాకరమని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఇవి నిజంగానే రైతు సంఘాల మాటలా లేక ఎవరైనా వారి వెనకుండి ప్రేరేపిస్తున్నారా అని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.

"ఒకటిన్నర సంవత్సరం పాటు అమలు కాని, అమలుకు రాని చట్టాలపై ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారు? ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలో చర్చలకు సిద్ధంగా ఉండగా, రైతు సంఘాలు ఈ ధోరణి ఎందుకు ఎంచుకున్నట్టు?" అని ప్రశ్నించారు. జనవరి 26న జరిగిన సంఘటనల నేపథ్యంలో రైతు సంఘాలు ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల సమస్య మరింత క్షిష్టం అవుతుందే తప్ప, పరిష్కారానికి ఏమాత్రం దోహదం పడదన్న విషయం రైతు నేతలు గుర్తించాలని విజయశాంతి హితవు పలికారు.

ఇప్పుడీ అంశంపై అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు కూడా స్పందిస్తున్నారని, వారు ఈ విషయంపై ఇంత శ్రద్ధగా పోస్టులు పెట్టేందుకు తెగబడడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనలు తమకు తెలియకుండానే కొందరు చేశారని రైతు ఉద్యమంలోని వారే చెబుతున్నప్పుడు, ఉద్యమం వారి నియంత్రణలో లేదని వారే ఒప్పుకున్నట్టుగా అర్థమవుతోందని రాములమ్మ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులకే రక్షణ లేక దాడులకు గురవుతుంటే, సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? వారి ప్రాణాలకు ఎవరు హామీ ఇస్తారు? అని విజయశాంతి ప్రశ్నించారు.


More Telugu News