సామాజిక మాధ్యమాల్లో హుందాగా ప్రవర్తిస్తేనే పాస్ పోర్టుకి క్లియరెన్స్!: ఉత్తరాఖండ్ నిర్ణయం

  • సోషల్ మీడియా ఖాతాల స్క్రూటినీ
  • ఆ తరువాతే క్లియరెన్స్ ఇవ్వాలని ఉత్తరాఖండ్ నిర్ణయం
  • పాస్ పోర్టు చట్టంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే
  • వెల్లడించిన రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్
పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసే వారి సామాజిక మాధ్యమ ఖాతాలను స్క్రూటినీ చేయాలని ఉత్తరాఖండ్ నిర్ణయించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను మిస్ యూజ్ చేయడాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. పాస్ పోర్టు దరఖాస్తుదారులు ఆన్ లైన్ లో ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని పరిశీలించిన తరువాతే క్లియరెన్స్ ఇస్తామని ఆయన అన్నారు. ఈ విషయంలో అన్ని వర్గాలతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన తరువాతే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఇదేమీ కొత్త నిర్ణయం కాదని, పాస్ పోర్టు చట్టంలో ఈ నిబంధన ఇప్పటికే ఉందని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎవరికీ పాస్ట్ పోర్టు జారీ చేయాల్సిన అవసరం లేదని చట్టంలో ఉందని, దాని ఆధారంగానే సోషల్ మీడియా ఖాతాల స్క్రూటినీ జరుగుతుందని పేర్కొన్నారు. ఓ పోలీసు అధికారిగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ను నిలువరించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులే ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసం దిశగా సాగడానికి కూడా సోషల్ మీడియానే కారణమని వ్యాఖ్యానించిన ఆయన, పౌరులు మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉందని, ఇష్టానుసారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెట్టే వారికి పాస్ పోర్టు రావడం కష్టమవుతుందని అన్నారు. కాగా, ఇప్పటివరకూ పాస్ పోర్టుకు దరఖాస్తు చేసిన వారికి ఏదైనా నేరచరిత్ర ఉందా? అన్న విషయాన్నే పరిశీలిస్తుండగా, తాజాగా సోషల్ మీడియానూ పరిశీలించాలని ఉత్తరాఖండ్ నిర్ణయించడం గమనార్హం.


More Telugu News