రైతుల నిరసనలను ప్రస్తావించిన అమెరికాకు ఇండియా కౌంటర్... కాపిటల్ హిల్ విధ్వంసం సంగతేంటని ప్రశ్న!

  • రైతు నిరసనలను ప్రస్తావించిన యూఎస్ ప్రతినిధులు
  • నిరసనకారుల సెంటిమెంట్ గా వ్యాఖ్యానించిన భారత్
  • స్థానిక చట్టాల పరిధిలోనే చూడాలన్న విదేశాంగ శాఖ
అమెరికా ప్రజా ప్రతినిధులు ఇండియాలో జరుగుతున్న రైతు నిరసనలను ప్రస్తావించిన వేళ, భారత విదేశాంగ శాఖ ఘాటుగా బదులిచ్చింది. అమెరికా, యూఎస్ లు రెండూ బలమైన ప్రజాస్వామ్య దేశాలేనని వ్యాఖ్యానించిన ఆ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ, భారత వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలను యూఎస్ గుర్తించిందనే భావిస్తున్నామని అన్నారు.

 ఇదే సమయంలో "చారిత్రక ఎర్ర కోట మైదానంలో జనవరి 26న జరిగిన కొన్ని దురదృష్టకర ఘటనలు నిరసనకారుల సెంటిమెంట్ తో కూడుకున్నవి. అటువంటివే జనవరి 6న కాపిటల్ హిల్ భవంతిపై జరిగాయి. ఇటువంటి ఘటనలు స్థానిక చట్టాల పరిధిలోనే పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది" అని అన్నారు.

దేశ రాజధానిలో ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేయడంపై స్పందిస్తూ, మరిన్ని హింసాత్మక ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆ పని చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక, రైతు నిరసనల వెనుక విదేశాలకు చెందిన ఖలిస్థానీ గ్రూప్ ల ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో, యూఎస్ కేంద్రంగా నడుస్తున్న 'సిక్స్ ఫర్ జస్టిస్' గ్రూప్ ప్రమేయం ఏమైనా ఉందా? అన్న విషయమై విచారణకు సహకరించాలని విదేశాంగ శాఖ అమెరికాను కోరింది.

కాగా, రైతుల నిరసనలపై పాప్ స్టార్ రిహన్నా స్పందించిన తరువాత, ఎంతోమంది యూఎస్ రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం, లక్షలాది మంది రైతుల మనోభావాలను గౌరవించడంలో భారత్ విఫలమైందని, వారి సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించడం లేదని కామెంట్లు రావడంతో, భారత నేతలు, సెలబ్రిటీలు సైతం ఘాటుగానే స్పందించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే యూఎస్ విదేశాంగ శాఖ తన తాజా మీడియా బ్రీఫింగ్ లో, "శాంతియుతంగా జరుగుతున్న ఏ నిరసనలైనా ప్రజాస్వామ్య భద్రతకు సూచికలే. మేము దాన్ని గుర్తించాం. భారత సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని గుర్తించింది. రైతులు, ప్రభుత్వం మధ్య ఉన్న ఎటువంటి విభేదాలనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాం" అని పేర్కొంది.


More Telugu News