టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ

  • ఏపీలో పంచాయతీ ఎన్నికలు
  • మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ
  • పల్లె ప్రగతి-పంచ సూత్రాలు పేరిట మేనిఫెస్టో
  • ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ
  • స్పందించిన ఎన్నికల సంఘం
మునుపెన్నడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మేనిఫెస్టోను రద్దు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పల్లె ప్రగతి-పంచ సూత్రాలు పేరిట తెలుగుదేశం పార్టీ ఈ మేనిఫెస్టో తీసుకువచ్చింది. అయితే, ఈ మేనిఫెస్టో రాజ్యాంగ విరుద్ధం అంటూ అనేక విమర్శలు వచ్చాయి. పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు పార్టీ తరఫున మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారన్న వాదనలు వినిపించాయి.

దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మేనిఫెస్టో విడుదలపై టీడీపీ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News