దేశాభివృద్ధికి రైతులే వెన్నెముక: ప్రధాని నరేంద్ర మోదీ

  • చౌరీ చౌరా ఘటనకు వందేళ్ల కార్యక్రమంలో వ్యాఖ్యలు
  • రైతు స్వావలంబన కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామని వెల్లడి
  • స్వాతంత్ర్య సంగ్రామంలో రైతుల పాత్ర కీలకమన్న ప్రధాని
  • చౌరీ చౌరాకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని వ్యాఖ్య
  • కొన్ని కోట్ల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిల్చిన ఘటన అన్న మోదీ
సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. నానాటికీ అది మరింత ఉద్ధృతమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధికి రైతులే వెన్నెముక అని అన్నారు. చౌరీ చౌరా సహా స్వాతంత్ర్య సంగ్రామంలో వారి పాత్ర మరువలేనిదని అన్నారు. నేటితో చౌరీ చౌరా ఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

‘‘దేశాభివృద్ధిలో రైతుల పాత్ర కీలకం. వారి కోసం గత ఆరేళ్లలో ఎన్నో చర్యలు తీసుకున్నాం. వారి స్వావలంబన కోసం పలు పథకాలు తీసుకొచ్చాం. మండీలతో రైతులు లాభపడేలా వాటిని ఆన్ లైన్ కు అనుసంధానించాం. మరో వెయ్యి మండీలనూ ఈనామ్ కు అనుసంధానించబోతున్నాం. ఇలాంటి చర్యల వల్లే కరోనా మహమ్మారి సమయంలోనూ వ్యవసాయ రంగం ఎనలేని వృద్ధిని సాధించింది’’ అని మోదీ అన్నారు.  

చౌరీ చౌరా ఘటనలో అమరులైన వారిని స్మరించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్ర పుటల్లో వారి త్యాగాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. ఈ నేలపై చిందిన వారి రక్తం మాత్రం ఎప్పటికీ అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని కొనియాడారు. చౌరీ చౌరా ఘటన ఒక్క పోలీస్ స్టేషన్ కే పరిమితం కాదన్నారు. ఆ స్టేషన్ కు పెట్టిన నిప్పు కొన్ని కోట్ల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిల్చిందన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల చౌరీ చౌరా పోరాటాన్ని చిన్న ఘటనగానే చిత్రీకరించారన్నారు.

దేశ ఐకమత్యమే మన ప్రాధాన్యం కావాలని, దానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఐక్యతకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలని ఆయన సూచించారు.

కాగా, 1922లో జరిగిన చౌరీ చౌరా పోరాటంలో భాగంగా అక్కడి పోలీస్ స్టేషన్ కు ఉద్యమకారులు నిప్పు పెట్టారు. ఆ ఘటనలో 23 మంది పోలీసులు చనిపోయారు. ఆ ఘటనతో మహాత్మా గాంధీ.. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉన్న పళంగా నిలిపేశారు. ఘటనకు సంబంధించి వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 228 మందిపై విచారణ చేశారు. విచారణ సమయంలోనే ఆరుగురు చనిపోగా.. 172 మందికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగతా వారికి జీవిత ఖైదును విధించింది. ఈ విచారణ దాదాపు 8 నెలల పాటు సాగింది.


More Telugu News